తెలంగాణలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి.. అమెజాన్ 20,761 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి.. అమెజాన్ 20,761 కోట్లు 

November 6, 2020

telangana fdi foreign direct investment minister ktr tweet

తెలంగాణకు అతి పెద్ద విదేశీ పెట్టుబడి వస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రోజు ఉదయం కీలక ప్రకటన చేస్తానని నిన్న చెప్పిన మంత్రి ఈ రోజు విషయం వెల్లడించారు. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. అమెజాన్ వెబ్ సర్వీస్ రాష్ట్రంలో రూ.20,761 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెడుతోందని ట్వీట్ చేశారు. 2022లో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలోఅమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లు వస్తాయని తెలిపారు. 

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు అంటే 2.77 బిలియన్ డాలర్లతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వల్ల వేలాది మంది డెవలపర్లకు, స్టార్ట్ అప్ లకి, ఇతర ఐటీ కంపెనీలకు వెబ్ ఆధారిత సర్వీసులను నడుపుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ కామర్స్ ,పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి మరియు ఇతర అనేక రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది. 

కాగా, హైదరాబాద్‌లో అతి పెద్ద వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని కేటీఆర్ గురువారమే తెలిపారు. హియాయత్ నగర్‌లో వన్‌ప్లస్‌ నిజాం ప్యాలెస్‌పేరుతో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటుచేశారు. అమెజాన్ తెలంగాణలో ఇప్పటికే కొన్ని పెట్టబడులు పెట్టింది. హైదరాబాద్‌లో ఆ కంపెనీకి ఇప్పటికే ఓ భారీ కార్యాలయం ఉంది.