తెలంగాణ లో ‘ జానపద జాతర ’ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ లో ‘ జానపద జాతర ’

August 22, 2017

మరుగున పడుతున్న కళలకు జీవం పోసే దిశలో తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ఎన్నో కళలు వివక్షకు గురై అడుగంటి పోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి వాటికి పూర్వ వైభవం తెచ్చే పనిలో పని చేస్తోంది. కళలు మానవ జీవన విధానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి కళలకు ఏడాదికొకసారి హారతి పట్టే బృహత్తర కార్యాన్ని భుజాన వేస్కుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. ఆ దిశలో ఈ ఏడాది కూడా ‘ జానపద జాతర 2017 ’ ను అత్యంత అట్టహాసంగా నిర్వహించ తలపెట్టింది. ఈ వారం రోజులు తెలంగాణ జిల్లాలు కళాకారుల కళా ప్రదర్శనలతో పులకించనున్నాయి.

అంతర్జాతీయంగా వివిధ దేశాలు, ప్రభుత్వాలు ఆగస్టు 22వ తేదీని ‘ ప్రపంచ జానపద దినోత్సవం ’ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జన జీవనంలో, జాతి సాంస్కృతిక వారసత్వంలో అత్యంత కీలకమైన అభివ్యక్త రూపాలు జానపద కళారూపాలు. నిజానికి జానపద కళలు అన్నీ జ్ఞానపదాలు, జన హృదయ కేతనాలు. తెలంగాణ అలాంటి హృదయ కళలకు, జ్ఞానపదాలకు పెట్టని కోట.

“ తెలంగాణ కోటి రతనాల వీణ ” మాత్రమే కాదు, ‘ జానపద కళలకు తరగని ఖజానా ’. ఈ విషయాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ జానపద ఉత్సవాలను ఘనంగాను, అన్ని జిల్లాల్లోనూ స్థానిక జానపద కళాకారుల బృందాలను, సాంస్కృతిక సారథి కళాకారుల బృందాలను కలుపుకొని నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. ఆ మేరకు ఈ ఉత్సవాలకు “ జానపద జాతర – 2015 ” అని పేరు పెట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో “ జానపద జాతర ” పేరుతో జానపద ఉత్సవాలను 10 రోజులపాటు జరిగే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవాలను భాషా సాంస్కృతిక శాఖ గత 2 సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించింది.

ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా “ జానపద జాతర – 2017 ”ను నిర్వహించాలని ప్రభుత్వ కార్యదర్శి సందర్భం (2) ద్వారా ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దీనిని అనుసరించి ఈ దిగువ తేదీల్లో “ జానపద జాతర – 2017 ”ను జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని నిర్ణయించింది.

క్ర. సం. తేదీ జరిగే ప్రదేశం/జిల్లా ప్రధానాంశం

01. 22 ఆగస్టు 2017: ప్రారంభోత్సవ వేడుకలు

నిజామాబాద్, జోగులాంబ గద్వాల్, వరంగల్ రూరల్, ఆదిలాబాద్

02. 23 ఆగస్టు 2017 నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రాజన్న సిరిసిల్ల

03. 24 ఆగస్టు 2017 జనగాం, కరీంనగర్, మహబూబ బాద్

04. 25 ఆగస్టు 2017 జగిత్యాల, వరంగల్ అర్బన్, మెదక్, యాదాద్రి భువనగిరి

05. 26 ఆగస్టు 2017 ఖమ్మం, జయశంకర్ భూపాల్ పల్లి, మంచిర్యాల

06. 27 ఆగస్టు 2017 సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి

07. 28 ఆగస్టు 2017 మహబూబ్ నగర్, కామారెడ్డి, సంగారెడ్డి

08. 29 ఆగస్టు 2017 సిద్ది పేట, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్

09. 31 ఆగస్టు 2017: రవీంద్రభారతిలో ముగింపు వేడుకలు రంగారెడ్డి, మెడ్చల్, వికారాబాద్, హైదరాబాద్

సక్రమ నిర్వహణకు సూచనలు:

1) ఈ ‘ జానపద జాతర ’ ఆయా జిల్లాల పౌర సంబంధాల శాఖాధికారుల నేతృత్వంలో, జిల్లా పర్యాటక అధికారుల సమన్వయంతో జరగాలి.

2) ఈ ఉత్సవాలలో ప్రతి జిల్లా నుండి అన్ని కళారూపాలకు సంబంధించిన ఎనిమిది (08) కళాబృందాలను జిల్లా పౌర సంబంధాల శాఖాధికారులు ఎంపిక చేసి కళాప్రదర్శన నిర్వహించాలి.

3) ఈ ‘ జానపద జాతర ’ను సాయంత్రం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు నిర్వహించాలి.

4) వివిధ జిల్లాల్లో “ జానపద జాతర – 2017 ”లో కళాప్రదర్శన చేసిన జానపద కళాకారుల పారితోషకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నియమాలకు లోబడి చెల్లిస్తుంది. ఆమేరకు ఆయా జిల్లాల సమాచార పౌర సంబంధాల శాఖాధికారులు ఆయా కళాకారుల కళాప్రదర్శనకు సంబంధించిన వివరాలను, వారి బ్యాంక్ ఖాతా నెంబర్లను, ఐ. ఎఫ్. ఎస్. సి. కోడ్ లతో సహా దృవీకరించి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల వారికి ప్రదర్శన జరిగిన తేదీ నుంచి వారం రోజుల్లో అందచేయాలి. ఆ తర్వాత పరిశీలన జరిపి ఆయా పారితోషికాల మొత్తాలను కళాకారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేయటం జరుగుతుంది.

5) జిల్లా పౌర సంబంధాల శాఖాధికారులు తమతమ జిల్లాలోని నిర్దారిత కేంద్రాల వద్ద జానపద జాతర కళాప్రదర్శనలకు అనువుగా వేదికలను ఏర్పాటు చేయటం, సౌండ్, లైట్ సౌకర్యాలను సమకూర్చాలి. డిప్యూటీ ఎగ్గ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు ఈ ఏర్పాట్లకు సహకరించాలి. దీనికిగాను సంబంధిత జిల్లా కలెక్టర్లు తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరనైనది.

6) జానపద జాతర వేడుకలను ఆయా జిల్లాల స్థానిక జానపద కళాకారుల సంఘాల ప్రతినిధులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమన్వయంతో జరుపుకోవాలి.

7) ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు తప్పనిసరిగా ఒక గంటపాటు సమయాన్ని కేటాయించాలి.

పై సూచనలను తు.చ. తప్పకుండా పాటించి, మన రాష్ట్రంలో ఇంత విస్తృతస్థాయిలో మూడోసారి జరుగుతున్న ‘ జానపద జాతర – 2017 ’ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం.

అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకు మామిడి హరికృష్ణ తెలిపారు.