ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ సేవ చేస్తున్నా.. గవర్నర్ తమిళిసై - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ సేవ చేస్తున్నా.. గవర్నర్ తమిళిసై

June 2, 2022

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం రాజ్ భవన్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’ అని వ్యాఖ్యానించారు.తాను రాష్ట్రానికి గవర్నర్‌గా సేవ చేస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తమిళిసై అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదని చెప్పారు. ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని ప్రకటించారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు.

‘తెలంగాణకు సేవ చేయడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. ఇందులో భాగంగా రాజ్‌భవన్ స్కూల్‌లో విద్యార్థుల కోసం భోజన ఏర్పాట్లు చేశా. కొవిడ్ కాలంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షించాను. భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశా. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశా. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు అందించా’ అని తమిళిసై వివరించారు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావటం దైవ సంకల్పంగా భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆవిర్భావ వేడుకల కేక్తో పాటు పుట్టినరోజు కేక్ కూడా గవర్నర్ తమిళిసై కట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.