ఈ మూడేళ్లలో ఏం జరిగింది? ఏం జరగనుంది? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మూడేళ్లలో ఏం జరిగింది? ఏం జరగనుంది?

June 2, 2017

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ముచ్చటగా మూడేళ్లు నిండాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన.. బంగారం తెలంగాణ దిశగా పయనిస్తుంది.భవిష్యత్ తెలంగాణ కోసం ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయ్..ఇంకా ఎన్ని అడుగులు వేయాలి. చేసింది ఎంత…చేయాల్సింది ఇంకా ఎంత ఉంది. కోటి ఎకరాలకు నీళ్లు ఎంతవరకు వచ్చాయి.డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అస్సులు మూడేళ్లలో కేసీఆర్ అనుకున్న లక్ష్యాల్ని సాధించారా…ఇంకా సాధించాల్సింది ఎంత ఉంది..?

మూడేళ్లలో ఏమాటకామాటే చెప్పుకోవాలంటే సీఎం కేసీఆర్ పాలన సూపర్. అద్భుతం అనలేం కానీ ఫర్వాలేదు కంటే పైనే స్కోర్ చేశారు. పాలనలో ఎంత మొనగాడు ఉన్నా.. చేసిన పనులకన్నా..చేయాల్సిన పనులే జనాలకు గుర్తుకువస్తాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకైనా…అమెరికా దాకా అయిన అంతే. చేసిన పనులు కొంతే కావచ్చు..చేయాల్సివి చాలా ఉండొచ్చు..బంగారు తెలంగాణ అంటే ఒక్క టర్మ్ కే రాదు.. కాదు కూడా..రెండు, మూడు టర్మ్ లు ఇచ్చినా ఆ టార్గెట్ చేరుకోవడం కష్టం. ఎప్పుడొచ్చమన్నది. ఎన్నళ్లయింది అన్నది ముఖ్యం కాదు..ఎంత చేశామన్నది ముఖ్యం. అనుకున్న లక్ష్యం దిశగా మూడేళ్లలో ఎన్ని అడుగులు పడ్డాయంటే… కొంతే చేశారు.. చేయాల్సింది చాలా ఉంది అని చెప్పాలి..ఇందులో నో డౌట్.
ముచ్చగా మూడేళ్లలో చేసిన మంచి పనుల్లో కొన్నింటిని యాది చేసుకుందాం. అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్ తెలంగాణ కోసం బలమైన పునాదులే వేస్తున్నారు. మాటిచ్చినట్టు రైతులకు మొత్తం రుణాల్ని మాఫీ చేశారు. కరెంట్ కష్టాల్ని అధిగమించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకపోయినా..ఇచ్చిన ఆరేడు.ఏడు గంటలు లో ఓల్టేజీ లేకుండా ఇచ్చారు. ఈ యాసంగి నుంచి రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని మూడేళ్ల ముచ్చటలో సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. అంగన్ వాడీ, హోంగార్డులు, పోలీసులు, కరెంట్ ఉద్యోగులకు మాట ఇచ్చినట్టుగా జీతాలు పెంచారు. సంక్షేమ పథకాల అమలు తీరు ఆశ్చర్యపోయేలా లేకున్నా నాట్ బ్యాడ్. పేద యువతుల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థికసాయమందిస్తున్నారు. ఈ సారి కొత్తగా గర్భిణీలకు 15వేల విలువైన కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు. గర్భిణీల వైద్యపరీక్షల కోసం మూడు విడతలుగా రూ.12 వేలు అందిస్తారు. ఇక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు బేషుగ్గానే జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ఐటీ, పరిశ్రమలశాఖలు ప్రగతిపథంలో సాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరాకు నాలుగు వేలు..రెండు పంటల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు.నిజంగా ఇది రైతుల్ని సంతోషపరిచే వార్తే. ఇలా బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ స్టయిల్లో పాలన నడుస్తోంది.
మూడేళ్లలో మంచి పనులే కాదు.. చేయనివి కూడా చెప్పుకోవాలి కదా.. ఆ విషయాకొస్తే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం మూడు, నాలుగు చోట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపాదనల దశ దాటలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దుమ్ము దులపాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పథకం అమలుకు చర్యలు సత్వరమే చేపట్టాలి. కేజీ టు పీజీ విద్య అమలు కూడా నత్తనడకన సాగుతుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా విద్యాశాఖాధికారుల తీరులో మార్పు రాలేదు..నిలువెల్లా అదే నిర్లక్ష్యం. ఈ శాఖను పరుగులు పెట్టించాల్సిన అవసరం చాలా ఉంది.
సకల వనరులతో సుసంపన్నంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ… పైసలకు అస్సలు కొదవలేదు. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో తీవ్ర జాప్యం. వివిధ శాఖల్లో వేలకు వేల పోస్టులు ఖాళీగా ఉన్నా..అధికారుల నిస్సత్తువతో వాటిని గుర్తించలేకపోతున్నారు. భర్తీ చేసిన , చేస్తోన్న ఉద్యోగాలు కొన్నే ఇంకా చాలా చేయాలి. కొలువుల బాధ్యత అంతా టీఎస్ పీఎస్సీపైనే పడేస్తున్నారు. అందుకు సరిపోను సిబ్బంది అక్కడ ఉన్నారో లేదో చూసుకోవాలి. ఉద్యోగాల భర్తీ వేగంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది.
పండించిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. తెలంగాణ వచ్చాక కూడా మార్కెట్లలో దళారీ దందా నడుస్తూనే ఉంది. వీటి నిర్మూలనకు చేస్తున్న కృషి సరిపోవడం లేదు..ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. మద్దతు ధరలు వచ్చేలా రైతులు సంతోషంగా ఉండేలా చూడాలి.
రోడ్లకు వేల కోట్లు కేటాయిస్తున్నా.. గుంతలు మాయం కావడం లేదు. కాంట్రాక్టర్లు గుంతల్లో కంకరపోసి అలా కానిచ్చేస్తున్నారు. రోడ్లపై ఒక్క గుంత కనిపించినా కాంట్రాక్టర్ల తోలు తీసేలా చర్యలు ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
మొత్తానికి మూడేళ్లలో కొంతే జరిగింది. ఇంకా చాలా చేయాలి. చేసి తీరాలి. అప్పుడే బంగారు తెలంగాణ దిశగా మరిన్ని అడుగులు పడుతాయి.