ఏపీలో తెలంగాణ యువతికి చేదు అనుభవం.. పరీక్ష పాసైనా..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో తెలంగాణ యువతికి చేదు అనుభవం.. పరీక్ష పాసైనా.. 

September 24, 2019

AP.. ..

ఓ తెలంగాణ యువతికి ఆంధ్రప్రదేశ్‌లో తీరని అన్యాయం జరిగింది. ఏపీ సచివాలయ ఉద్యోగం కోసం ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. ఇంక ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూస్తోంది. ఇంతలో ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందింది కావున ఏపీలో ఉద్యోగానికి అనర్హురాలని అధికారులు తేల్చేశారు. దీంతో ఆమె పడ్డ శ్రమ వృధా అయిందని కన్నీరు మున్నీరు అవుతోంది. 

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతుకూరుకు చెందిన మీనుగ నందిని వివాహం సంవత్సరం క్రితం ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తితో జరిగింది. దీంతో ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు అయిపోయింది. అప్పటినుంచి ఆమె అత్తవారింటి వద్దే వుంటోంది. ఈ క్రమంలో గుంటూరులో సచివాలయ ఉద్యోగాలకై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పరీక్షలు రాయడానికి సిద్ధమైంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని బాగా కష్టపడి చదివింది. పరీక్ష రాసింది. ప్రభుత్వం ఇచ్చిన కీ ప్రకారం నందినికి 90 మార్కులు వచ్చాయి. మైనస్‌ మార్కులు తీసివేస్తే 70 మార్కులు వస్తాయని, ఉద్యోగం గ్యారంటీగా వస్తుందని భావించింది. తనకు ఉద్యోగం వస్తుందని అందరికీ చెప్పుకుని సంబరపడింది. కానీ, ఆ సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు. సమీపంలోని నెట్‌ సెంటరులో హాల్‌టికెట్‌ నంబరు ఎంటర్‌ చేయగా, ఇన్‌వ్యాలీడ్‌ అని వచ్చింది. 

ఈ విషయమై జిల్లా అధికారులను సంప్రదించింది. అక్కడి అధికారులు చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోవడం ఆమె వంతు అయింది. రాష్ట్రం, జిల్లాలు మారినవారికి ప్రభుత్వం ఫలితాలు ఇవ్వకుండా ఆపివేసిందేమో అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. వారి మాట విని నందిని కన్నీళ్లు పెట్టుకుంది. వేరే రాష్ట్రం, వేరే జిల్లా కావడమే కారణమయితే ఆన్‌లైన్లో అప్లై చేసుకునే సమయంలోనే రిజెక్ట్‌ చేయవచ్చుగదా అని నందిని ప్రశ్నిస్తోంది. పరీక్షల కోసం ప్రిపేర్‌ అయి రాస్తే ఇలా వివక్ష చూపడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్న సమయంలో ఈ విధంగా మోసం చేయడం సరికాదని అంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని కోరుతోంది.