తెలంగాణ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తన జోరు కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లి పసిడి పంచ్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం 50 కేజీల విభాగం సెమీస్‌లో ఆమె 5-0 తేడాతో ఆలిండియా పోలీస్ (ఏజీపీ) జట్టు బాక్సర్ శివిందర్ కౌర్‌ను చిత్తుచేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న నిఖత్.. ఈ బౌట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సోమవారం జరిగే ఫైనల్లో రైల్వేస్ బాక్సర్ అనామికతో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది.
నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ (75 కి.), మంజూ రాణి (48 కి), జ్యోతి గులియా (52 కి) కూడా తమ విభాగాల్లో ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరారు. ప్రపంచ యూత్ ఛాంపియన్, నేషనల్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, ఆసియా కాంస్య పతక విజేత అంకుషిత కూడా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రపంచ యూత్ ఛాంపియన్ అరుంధతి చౌదరితో 75కేజీల విభాగంలో లవ్లీనా తుదిపోరులో తలపడనుంది. కాగా ప్రతిష్ఠాత్మక ఈ ఈవెంట్లో 302మంది బాక్సర్లు 12 కేటగిరిల్లో పోటీపడ్డారు. ఫైనల్స్ నేడు జరగనున్నాయి.