Telangana: Good news for employees..Next month salary along with a DA
mictv telugu

తెలంగాణ: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే నెల వేతనంతోపాటు డీఏ

September 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. సిబ్బందికి అక్టోబర్‌లో వేతనంతోపాటు ఒక డీఏను ఇవ్వబోతున్నట్టు సోమవారం టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు, తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 300 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు ఆయన తెలిపారు.

”ఆర్టీసీ సిబ్బందికి అక్టోబర్‌లో వేతనంతోపాటు ఒక డీఏను ఇవ్వబోతున్నాం. ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకొన్నాం. అతి త్వరలో విడతల వారీగా 1200 ఉద్యోగాలకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నాం. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌తో జీవ వాటర్‌ బాటిళ్లను ప్రారంభిస్తున్నాం.” అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాకుండా, గత ఏడాది కాలంలో ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ ఆశీస్సులతో అనేక చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎండీ వీసీ సజ్జనార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రీజినల్‌ మేనేజర్లు, డిప్యూటీ రిజినల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సిబ్బంది అందరికీ బాజిరెడ్డి గోవర్ధన్‌ శుభాభినందనలు తెలియజేశారు.