Telangana: Good news for travelers..the app has arrived
mictv telugu

తెలంగాణ: ప్రయాణికులకు శుభవార్త..యాప్ వచ్చేసింది

July 27, 2022

తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఏ పండుగ వచ్చిన, ఏ జాతర జరిగిన ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారి గమ్య స్థానాలకు చేరవేస్తుంది. తాజాగా టీఎస్ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు మరో శుభవార్తను చెప్పారు. ఇక నుంచి ప్రయాణికులు బస్‌స్టాపుల్లో బస్సుల కోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుండా, ఆర్టీసీ బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని, ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌లో మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.

”ఈ ట్రాకింగ్ యాప్ ద్వారా.. బస్సు ఎక్కడుంది? బస్‌స్టాప్‌కు ఎప్పుడు వస్తుంది? ఎంత సమయంలో వస్తుంది? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్రయాణికులు బస్‌స్టాప్లు/బస్ స్టేషన్లలో నిరీక్షించే సమయాన్ని నివారించడానికి, ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి దోహదపడుతుంది. ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించాం. వీటిలో కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్ఫక్ బస్సులు, శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర సుదూర ప్రాం తాలకు నడుపుతున్న మియాపూర్-1 డిపోకు చెందిన 100 బస్సుల్లో ఈ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రా చలం, విశాఖపట్నం రూట్లలో నడుస్తున్న పికెట్ డిపో బస్సుల్లో ఇప్పటికే ట్రాకింగ్ నడుస్తుంది. మరో రెండు నెలల్లో జిల్లాలతోపాటు హైదరాబాద్లో అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను యాప్లో చేరుస్తాం” అని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు.. ఈ ట్రాకింగ్ వ్యవస్థను 96 డిపోలు, 4,170 బస్సుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ, మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెతోపాటు డిస్ట్రిక్ట్ సర్వీసుకు వేర్వేరుగా ట్రాక్ చేశారు. విమానాశ్రయానికి 24/7 నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ ట్రాకింగ్ వ్యవస్థ ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది. గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల సమాచారాన్ని సైతం ట్రాక్ చేయొచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో లేదా www.tsrtc.telangana.gov.inలో ఇచ్చిన లింక్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.