Telangana: Good news..replacement of 1,569 jobs!..starting from today
mictv telugu

తెలంగాణ: గుడ్‌న్యూస్..1,569 ఉద్యోగాల భర్తీ!..నేటి నుంచే ప్రారంభం

September 7, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న 1,569 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియను ఈరోజు నుంచే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

”పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న 1,569 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మున్సిపాలిటీల్లో 349 పోస్టులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,220 పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో జిల్లాల వారీగా భర్తీ చేయనున్నాం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నాం. ఈ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు యునానీ, హోమియోపతి, నేచురోపతి అభ్యర్థులు అర్హులు. నియామక ప్రక్రియ మార్గదర్శకాలను ప్రభుత్వం గత నెలలోనే విడుదల చేసింది” అని అధికారులు పేర్కొన్నారు.

ఇక, పట్టణ ప్రాంతాల విషయానికొస్తే..ఆరోగ్య ఉప కేంద్రాల్లో పని చేసేందుకు ఎంబీబీఎస్‌ లేదా బీఎంఎస్‌ పూర్తి చేసి ఉండాలి. ఇందులో ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక, గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే.. ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్‌ నర్స్‌లు సైతం అర్హులు. స్టాఫ్‌నర్స్‌ల్లో 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసినవారు, 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం పూర్తిచేసి ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్‌ బ్రిడ్జి కోర్టు (సీపీసీహెచ్‌) పూర్తి చేసినవారు అర్హులు. డాక్టర్లకు రూ.40 వేలు, స్టాఫ్‌ నర్స్‌కు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు. ఈ పోస్టులకు కనీస వయసు 18 ఏండ్లు, గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఇచ్చే అవకాశం. మెరిట్‌ ఆధారంగా పోస్టింగ్‌ ఆప్షన్లు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండువారాలు శిక్షణ ఇస్తారు. ఈ నెలాఖరులోగా లేదా.. అక్టోబర్‌ మొదటివారంలోగా నియామకాలు పూర్తి చేస్తారు.