రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల కేవలం 8 సంవత్సరాల్లోనే సుమారు 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న ఆయన.. భారత దేశ చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణను పరిచయం చేశారు. ప్రపంచంలోనే 35 శాతం వ్యాక్సిన్ల తయారీ తెలంగాణలో జరుగుతోందని, ప్రముఖ ఐటీ కంపెనీలైన ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటివి అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్ లను హైదరాబాదులో పెట్టాయని పునరుద్ఘాటించారు.
టీఎస్ ఐ పాస్ విధానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రం ప్రత్యేకత, ప్రాధాన్యతను గుర్తించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం నాలుగవ పారిశ్రామిక విప్లవానికి సంంధించి ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. అలాగే మంగళవారం మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. పెప్సికో తన కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. బ్యాటరీలు తయారు చేసే అలాక్స్ కంపెనీ రూ.750 కోట్లను పెట్టుబడిగా పెడతానని ముందుకు వచ్చింది. హైదరాబాదులో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభిస్తామని అపోలో టైర్స్ వెల్లడించింది. లండన్ తర్వాత తమ రెండో సెంటర్ నగరంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.