ఎమ్మార్వో కేసు ఎఫెక్ట్.. బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలు బంద్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మార్వో కేసు ఎఫెక్ట్.. బాటిళ్లలో పెట్రోల్‌ అమ్మకాలు బంద్‌

November 11, 2019

తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ అమ్మడంపై నిషేధం విధించింది. ఇటీవలి కాలంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్‌ను వాడడం ఎక్కువైంది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేశ్‌ అనే వ్యక్తి తన వెంట ప్లాస్టిక్‌ బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి సజీవదహనం చేసిన సంఘటన సంచలనమైనది. ఈ సంఘటన తరువాత ఇద్దరు రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్ బాటిల్స్‌తో వెళ్లారు. దీంతో ఆ ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది హడలిపోయారు. అలాగే కొందరు ఆత్మహత్య చేసుకునే విషయంలో, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడానికి పెట్రోల్‌ బాటిల్స్‌తో హల్‌చల్‌ చేసిన సంఘటనలున్నాయి. 

Telangana government.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోల్‌ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్‌ పోయొద్దని ఆదేశించింది. దీంతో బంకుల యజమానులు ‘నో పెట్రోల్‌ ఇన్‌ ప్లాస్టిక్‌ బాటిల్‌’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. బాటిళ్లలో పెట్రోల్‌ పోయవద్దన్న ఆదేశాలతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలో సులువుగా పెట్రోల్‌ తీసుకెళ్లి వ్యక్తులపై పోసి నిప్పంటించడం గాని, తమకు తాము పోసుకుని కాల్చుకోవడం గాని జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు అంటున్నారు. వాహనం తీసుకొస్తేనే పెట్రోల్‌ పోస్తామని పెట్రోల్‌బంక్‌ యజమానులు తెలిపారు.