తెలంగాణలో దీపావళి బాణసంచాపై హైకోర్టు నిషేధం  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో దీపావళి బాణసంచాపై హైకోర్టు నిషేధం 

November 12, 2020

Telangana Government bans Diwali fireworks

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చకుండా నిషేధం విధించింది. గాలి కాలుష్యం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాణసంచా కాల్చకుండా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. పటాకులు కాల్చకుండా నిషేధం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎవరూ క్రాకర్స్ అమ్మొద్దని, కొనొద్దని, నిషేధాన్ని ఉల్లంఘిస్తే కేసులు పెట్టాని స్పష్టం చేసింది. 

కాలుష్య నివారణ కోసం బాణసంచాపై నిషేధం విధించాలని ఇంద్రప్రకాశ్ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో కరోనా కేసులు ఉన్నాయని ఈ సమయంలో పటాకులు కాల్చితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్రాకర్స్ వల్ల ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతారని వివరించారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిషేధానికి మొగ్గుచూపింది. ఇప్పటికే తెరిచిన పటాకుల దుకాణాలను మూసేయాలని స్పష్టం చేసింది. రాజస్తాన్ హైకోర్టు కూడా బాణసంచాను నిషేధించిందని గుర్తు చేసింది. నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఈ నెల 19 నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇదివరకే పటాకులపై నిషేధం విధించడం తెలిసిందే. ఉల్లంఘించిన వారికి లక్ష రూపాయల జరిమానా పడుతుందని హెచ్చరించింది. హరియాణా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. ఏపీలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకే కాల్చాలని జగన్ ప్రభుత్వం కూడా ఆంక్షలు తీసుకొచ్చింది.