తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు షాక్ ఇచ్చింది. వారికి ఇస్తున్న ప్రత్యేక అలవెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు కింది స్థాయి వరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గతంలో మావోయిస్టు ప్రాంతాల్లో పనిచేసే శాంతిభద్రతలు, ఏఆర్, స్పెషల్ పోలీసు సిబ్బందికి 15 శాతం అధిక ఎలవెన్సు ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈ అలవెన్సులు వర్తించేవి. అయితే ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం తగ్గినందున అలవెన్సుల అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి హోం శాఖ ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా చేసుకున్నారు. హోం శాఖ ఇటీవల 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే వారికే భద్రత సంబంధిత వ్యయం కింద నిధులు విడుదల చేసింది. ఈ జాబితాలో పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ జిల్లాల వారికే అదీ కూడా మావోయిస్టు ప్రభావం ఉన్న స్టేషన్లలో పనిచేసే వారికే అలవెన్స్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాలకు కోత విధిస్తున్నట్టు తేల్చి చెప్పింది. కాగా, దీనిపై పోలీసులు తమలో తాము చర్చించుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావం లేనప్పుడు ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎస్కార్టు, గన్మెన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.