తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు పోలీసు శాఖ శుభవార్త చెప్పింది. మంగళవారం వనపర్తి బహిరంగ సభలో బుధవారం నిరుద్యోగులందరు టీవీలు చూడండి భారీ ఉద్యోగ ప్రకటన చేయబోతున్నాను అంటూ కేసీఆర్ అన్నారు. ఆ మాట ప్రకారమే అసెంబ్లీలో కేసీఆర్ నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ఏకంగా 91,142 ఉద్యోగాలకు ప్రకటన చేశారు. అందులో 80,039 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయా శాఖలను ఆదేశిస్తున్నామని ప్రకటించారు. అందులో భాగంగా పోలీస్ శాఖలో 18,334 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలాయి. అయితే పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సిద్ధమైంది.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫ్రీ కోచింగ్ పై ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా.. జిల్లా, కమిషనరేట్ల పరిధిలో అభ్యర్థులకు ఉచితంగా ముందస్తు శిక్షణ ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఈ కోచింగ్ విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, కమిషనర్లకు సూచించారు.కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.