తెలంగాణ ప్రభుత్వం టీచర్ దంపతులకు శుభవార్త చెప్పింది. ఈ కేటగిరీకి చెందిన టీచర్ల బదిలీకి ఓకే చెప్పేసింది. దంపతులను ఒకేచోట బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 12 జిల్లాల్లో 247 మంది టీచర్లకు ఈ ఉత్తర్వు వర్తిస్తుండగా, ఒక్క సూర్యాపేట జిల్లాను మాత్రం మినహాయించారు. అటు రేపటి నుంచి రాష్ట్రంలో టీచర్ల, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 37 రోజుల పాటు ఈ ప్రక్రియ సాగనుండగా, ఆ తర్వాత 15 రోజులు అప్పీళ్లకు అవకాశం ఇస్తారు. మొదటగా సీనియారిటీని బట్టి ప్రధానోపాధ్యాయులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, చివరగా ఎస్జీటీ టీచర్లకు బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తారు. కాగా, రాష్ట్రంలో చివరిసారిగా 2015లో ఈ ప్రక్రియ జరిగింది. 2018లో కేవలం ట్రాన్స్‌ఫర్లు మాత్రమే చేయగా, ఈ సారి దాంతో పాటు ప్రమోషన్లు కూడా ఉండనున్నాయి. మొత్తం 9700 మందికి ప్రమోషన్లు, సుమారు 30 వేల మందికి బదిలీ అవకాశం లభించనుంది.