తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లేట్ ఫీజును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు లక్షన్నర మంది విద్యార్ధులకు ప్రయోజనం కలుగనుంది. ఇంతకుముందు ఉన్న లేట్ ఫీజు రూ. 1000 ని రూ. 100కి తగ్గిస్తూ కార్యదర్శి నవీన్ మిత్తల్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. అసలేమైందంటే.. రాష్ట్రంలో 346 కాలేజీలకు ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో కొంత జాప్యం జరిగింది. దీంతో సకాలంలో విద్యార్ధులు ఫీజు చెల్లించలేకపోయారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దృష్టికి తీసుకురాగా, ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ కాలేజీల్లోని విద్యార్ధులు ఈ నెల 7, 8 తేదీల్లో ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే మిగిలిన కాలేజీల్లోని విద్యార్ధులు మాత్రం గతంలో ప్రకటించిన మేరకే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.