Telangana government has given clarity on pension to the daughters of pensioners
mictv telugu

అలాంటి కుమార్తెలకు పెన్షన్ రాదు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

August 5, 2022

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ విషయంలో ఉన్న అపోహలను తొలగించి స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్న వారు మరణిస్తే తదుపరి ఆ పెన్షన్‌ను వారి జీవిత భాగస్వామికి ఇస్తోంది. అయితే తర్వాత ఆ జీవిత భాగస్వామి కూడా మరణిస్తే.. ఆ వ్యక్తిపై ఆధారపడిన వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు అర్హురాలు కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు 2010లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల నిర్వచనాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎవరైనా ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే అప్పటికే వారి జీవిత భాగస్వామి మరణించి లేదా విడాకులు పొంది ఉంటే అలాంటి సందర్బాల్లో మాత్రమే ఆ వ్యక్తిపై ఆధారపడిన వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు అర్హురాలు అవుతారని తాజాగా పేర్కొంది. వాటిని తప్పుగా అన్వయించుకొని ఫ్యామిలీ పెన్షనర్ల మరణానంతరం వారిపై ఆధారపడిన వితంతు లేదా విడాకులైన కుమార్తెలను తదుపరి లబ్దిదారులుగా గుర్తించరాదని ఆదేశించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ అకౌంట్ జనరల్‌తో పాటు ట్రెజరీ విభాగానికి లేఖ రాసింది.