మరో శుభవార్త.. డీఎస్పీ పోస్టులకూ వయోపరిమితి పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

మరో శుభవార్త.. డీఎస్పీ పోస్టులకూ వయోపరిమితి పెంపు

May 22, 2022

నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. ఇటీవల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల వయో పరిమితిని మరో రెండేళ్ల పాటు పొడిగించిన తెలంగాణ సర్కార్ డీఎస్పీ ఉద్యోగాలకు సంబంధించిన వయో పరిమితిలోనూ మార్పులు చేసింది. గ్రూప్‌-1 క్యాటగిరిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (DSP), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు రెండేండ్ల వయోపరిమితి పెంచుతున్నట్టు టీఎస్‌పీఎస్సీ ( తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) పేర్కొన్నది. గతంలో అర్హత 31 సంవత్సరాలు ఉండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో 33 సంవత్సరాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఎత్తు విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో 167.6 సెం.మీ ఉండగా.. ప్రస్తుతం దానిని 165 సెం.మీ.కు సడలించింది. మహిళలకు గతంలో 152.5 సెంటీమీటర్లు ఉండగా.. దాన్ని 150 సెంటీమీటర్లకు తగ్గించారు. వయోపరిమితిలో రెండేండ్ల సడలింపుతో దరఖాస్తులు పెరుగుతాయని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది.