మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మైనర్లను.. అరబ్ షేక్‌లు కాంట్రాక్ట్ పద్దతిలో పెళ్లిళ్లు చేసుకుని తమ దేశానికి తీసుకెళ్తున్న నేపథ్యంలో.. వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు వధూవరుల ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, వయస్సుసు ధ్రువీకరించాలని వక్ఫ్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షాదీ వివరాలను ఆన్లైన్లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించింది.
గతంలో ఉన్నట్లు తరహాలో ఖాజీలు ఎలా పడితే అలా పెళ్లిళ్లు చేయడానికి వీలు లేదని, ఆధార్ కార్డు తీసుకుని వయస్సును నిర్ధారించుకున్న తర్వాతే.. నిఖా చేయాలని ఆదేశించింది. మైనర్, కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేస్తే ఖాజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఖాజీల నియామకం మైనార్టీ శాఖ చేయదని, జిల్లా కలెక్టర్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ముస్లింల షాదీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, ఆన్లైన్లో మ్యారేజ్ సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది.