Telangana government has not given even a single rupee for the repair work of Kaleshwaram project,says Harish rao
mictv telugu

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తు పనులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు

September 6, 2022

వరదలో కూడా బురద రాజకీయం చేసే పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ నాయకులపై మండిపడ్డారు. గోదావరి నది చరిత్రలో 500 ఏళ్లలో రానంత వరద ఇటీవల వచ్చిందని.. 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. మంగళవారం శాసన మండలిలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపులు మునిగితే లక్ష కోట్ల ప్రాజెక్టు మునిగిందని, నాలుగేళ్లు ఇక నీళ్లు రావని బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రకృతి వైపరిత్యం వల్లే జరిగిందే తప్ప ఇది మానవతప్పిదం కాదన్నారు. ప్రాజెక్టులో డిజైన్ లోపం ఎక్కడా లేదని చెబుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ లోపల ప్రాజెక్టుకు ఏది జరిగినా పూర్తి బాధ్యత ఏజెన్సీదేనన్నారు. ఒక్క రూపాయి కూడా మరమ్మతు పనులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇస్తే, కేంద్ర మంత్రులు మాత్రం ఏం అనుమతులు లేవని అబద్దాలు చెబుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ పూర్తి కాలేదని మొన్న ఓ కేంద్రమంత్రి అన్నారని, డీపీఆర్ లేకపోతే కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేగంగా తామే అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పారన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు పారలేదని అని చెప్పే బీజేపీ నాయకులు.. బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు తానే స్వయంగా తన నియోజకవర్గానికి నీరు వదిలారని గుర్తు చేశారు. అన్నారం పంప్ హౌస్ ఈ నెల మూడో వారంలో, మెడిగడ్డ అక్టోబర్ నెలాఖారులోగా ప్రారంభిస్తామన్నారు హరీశ్ రావు. యాసంగికి రైతులకు ఎంత నీరు కావాలన్న అందిస్తామన్నారు.