ఇబ్రహీంపట్నం ఎఫెక్ట్.. ఆపరేషన్ల నిలిపివేత
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం వైద్యులను సస్పెండ్ చేసి వారి లైసెన్సులను కూడా రద్దు చేసింది. అంతేకాకా, ఘటనపై విచారణకు నిపుణుల కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మృతుల పోస్టుమార్టం రిపోర్టుతో పాటు కమిటీ నివేదిక వచ్చే వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేసింది. నివేదికల ఆధారంగా భవిష్యత్తులో క్యాంపుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. కాగా, మరణించిన మహిళల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇళ్లు, గురుకులలో పిల్లలకు ఉచిత విద్య వంటి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. అటు అస్వస్థతకు గురైన మిగతా మహిళలు నిమ్స్, అపోలో వంటి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.