మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్, ఎయిర్ పిస్టల్ షూటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్లో ట్రిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించినందుకు ఈషా సింగ్కు తెలంగాణ ప్రభుత్వం రూ. 2 కోట్ల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించనుంది. నగదుతో పాటు అదనంగా 600 చదరపు గజాల చొప్పున బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ లేదా గచ్చిబౌలి వంటి ప్రైమ్ లొకేషన్లలో ఈ ఇద్దరికి ఇంటి స్థలం కేటాయించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. వీరి రివార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2, 2022 నాడు పబ్లిక్ గార్డెన్లో నిఖత్ జరీన్, ఈషా సింగ్ ఇద్దరికీ చెక్కులు, భూమి పత్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులుమీదుగా అందజేయనున్నట్లు తెలుస్తోంది.