హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన నగరవాసులను దిగ్ర్భాంతికి గురి చేసింది. దగ్గర్లో ఉన్న అక్కను కలిసేందుకు ఒంటరిగా వెళ్తోన్న పిల్లాడిని కుక్కులు పీక్కుతింటున్న వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలో తిరుగాడే కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని మున్సిపాలిటీ, గ్రామ పరిధిలో చర్యలకు ఆదేశించింది. కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలని పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని… అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని చెబుతూ.. జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. కాసేపటి క్రితం వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో సమావేశమయ్యారు. కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. మాంసం వ్యర్ధాలను దుకాణ యజమానులు రోడ్లపై వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. హస్టల్స్, మెస్ , హోటల్స్ , రెస్టారెంట్స్ వంటి ప్రాంతాల్లో మిగిలిన ఆహర పదార్ధాలను ఖాళీ ప్రదేశాల్లో వేయడం వల్ల కూడా కుక్కలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మిగిలిన ఆహర పదార్ధాలను ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై వేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
మరోవైపు ఇళ్ల మధ్యలో కూడా ఆహర వ్యర్ధాలను వేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. మరో వైపు వీధి కుక్కల విషయమై ఫిర్యాదు చేసేందుకు 040 21111111 నెంబర్ ను అందుబాటులో ఉంటుందని మంత్రులు తెలిపారు.