తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది, పదవ తరగతి పరీక్షల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులు 2022 – 2023 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ రెండు తరగతులకు ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులు సమ్మేటివ్, 20 మార్కులు ఫార్మేటివ్ అసెస్ మెంట్ కి కేటాయించింది. సైన్స్ పరీక్షకు 3 గంటల 20 నిమిషాల సమయం, మిగతా సబ్జెక్టులకు మూడు గంటల సమయాన్ని నిర్దేశించింది. అలాగే సైన్స్ పేపర్ లో ఫిజిక్స్, బయాలజీలకు చెరో 50 మార్కులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పదవ తరగతి పరీక్షా షెడ్యూల్ ని విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మరూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని తేల్చి చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రిఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఫలితాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రావాలన్నారు. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లీష్, 8న మ్యాథ్స్, 10న ఫిజిక్స్ మరియు బయాలజీ, 11న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి సమయం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉంటుంది.