మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వాసుపత్రులకు ప్రసవానికి వెళ్లే గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ వంటి పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా.. గర్భిణీల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించటం కోసం న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసింది. ఇందులో రూ.1,962 విలువైన మరింత బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నది. ఒక్కొక్కరికి రెండుసార్లు ఈ కిట్‌ను అందించనున్నారు. ఈ పథకాన్ని బుధవారం నుంచి అమలు చేయనున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండటం లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనుంది.
గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను గర్తించిన ప్రభుత్వం.. రక్తహీనత అధికంగా ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టింది. రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేస్తారు. కిట్ల పంపిణీని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలిసి వర్చువల్ మోడ్‌లో ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ కిట్లలో ఉండే ఆహారంలో ప్రొటీన్స్ , మినరల్స్ , విటమిన్లు అధికంగా ఉంటాయి. తద్వారా రక్తహీనతను తగ్గించి, హిమోగ్లోబిన్ శాతం పెంపుకు తోడ్పడతాయి. ఫస్ట్ కిట్‌ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ సమయం లో, సెకండ్ కిట్‌ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇవ్వనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం ఉపయోగపడనున్నది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.