తెలంగాణ సర్కారు చేసేదేమీలేక నో చెప్పేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సర్కారు చేసేదేమీలేక నో చెప్పేసింది..

March 5, 2018

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం విరమించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌తో పాటు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు టి.హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజెందర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉభయ సభల్లో చీఫ్ విప్‌లు పి.సుధాకర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, హర్టికల్చర్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి,  అసెంబ్లీ కార్మదర్శి నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఈసారి బడ్జెట్లో వ్యవసాయదారుల కోసం మరిన్ని కార్యక్రమాలు, పథకాల కోసం నిధులు కేటాయిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. దీనికి గల సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చ జరిగింది. మొత్తం ప్రభుత్వానికి ఒకే బడ్జెట్ ఉండాలని, శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్లు ప్రవేశ పెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు. అసెంబ్లీ నియమావళిలోని రూల్ నెంబరు 150 ప్రకారం ఆదాయ, వ్యయాలు మాత్రమే బడ్జెట్ కిందికి వస్తాయని వివరించారు. ఇతరత్రా ప్రణాళికలు, వివరణలన్నీ పద్దుల కిందకే వస్తాయి కానీ, ప్రత్యేక బడ్జెట్ కింద పరిగణించడానికి వీలు లేదని అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకసారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో చివరికి ఉపసంహరించుకున్నారని అధికారులు చెప్పారు. కేంద్రంలో కూడా రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్లోనే కలిపి ప్రవేశ పెడుతున్న విషయాన్ని సీఎంకు వివరించారు. దీంతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు సీఎం ప్రకటించారు. బడ్జెట్లోనే వ్యవసాయరంగానికిస్తున్న ప్రాధాన్యతను, ప్రవేశ పెడుతున్న పథకాలను, వెచ్చిస్తున్న నిధులను వివరించాలని సీఎం చెప్పారు.