రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ పేరు చెప్పి వేడుకలు జరపకపోవడం సరికాదని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. దీంతో గురువారం రాజ్‌భవన్‌లోనే గవర్నర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి.. అక్కడ జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నారు.
ఇదంతా కౌశిక్ రెడ్డి వల్లే..
కచ్చితంగా కారణమిదని చెప్పలేం కానీ.. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతోనే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై ల మధ్య విభేదాలు తలెత్తాయి. మొదట్లో ఎలాంటి విభేదాలు లేవు. కౌశిక్ రెడ్డి విషయంలోనే.. గతేడాది రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదని అప్పట్లో రాజకీయ వర్గాలన్నీ గుసగుసలాడాయి. ఆ తర్వాత సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరంగానే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఎదురెదురు పడినా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ.
ఆనవాయితీ ప్రకారం.. రాజ్ భవన్లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. గవర్నర్ ఒక్కరే జెండా ఆవిష్కరణ చేశారు. ఇక ఈసారి ఏకంగా వేడుకలను రాజ్‌భవన్‌లోనే జరపాలని లేఖ పంపడంతో గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే రోజురోజుకు గవర్నర్, సీఎంల మధ్య దూరం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.