రాజ్‌భవన్‌లో కరోనా కలకలం.. గవర్నర్ తమిళిసైకు నెగిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్‌భవన్‌లో కరోనా కలకలం.. గవర్నర్ తమిళిసైకు నెగిటివ్

July 12, 2020

Raj Bhavan

కరోనా మహమ్మారి తెలంగాణ రాజ్‌భవన్‌కు కూడా పాకింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రాజ్ భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న 28 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. అటు రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బందిలోనూ 10 మందికి కరోనా సోకింది. వారి కుటుంబ సభ్యుల్లోనూ మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. 

అప్రమత్తమైన అధికారులు రాజ్‌భవన్‌లో పనిచేసే మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 347 మందికి నెగెటివ్ వచ్చింది. కరోనా సోకిన వారిని ఎస్సార్ నగర్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. ‘రెడ్ జోన్లలో ఉన్నవారు, కరోనా బాధితులను కలిసినవారు ముందుగా పరీక్షలు చేయించుకునేందుకు వెనుకాడవద్దు. అంతేకాదు, 4టీ (TTTT)లను తప్పకుండా పాటించాలని సూచించారు. టెస్ట్(పరీక్ష), ట్రేస్(ఫలితం), ట్రీట్(చికిత్స), టీచ్(అనుభవాలను ఇతరులకు బోధించడం) తప్పకుండా చేయాలి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.