ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021, జులై 1వ తేదీ నుంచి పెంపు ప్రయోజనం వర్తించనుంది. జనవరి వేతనం, పెన్షన్‌తో పాటు పెంచిన డీఏతో కూడిన వేతనాన్ని ప్రభుత్వం ఫిబ్రవరిలో అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
సీఎం కేసీఆర్ గారు నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1/2 pic.twitter.com/hZfp10gipA
— Harish Rao Thanneeru (@trsharish) January 23, 2023
2021, జులై నుంచి 2022, డిసెంబరు వరకు పెంచిన డీఏ బకాయిలను ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది. పెన్షనర్ల బకాయిలను మార్చి నెల పింఛనుతో ప్రారంభించి ఎనిమిది విడతల్లో చెల్లించనుంది. అదే విధంగా సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం బకాయిలను మార్చి నుంచి ఎనిమిది సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులను సమర్పించారు. తాజాగా ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉత్తర్వుల పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉంటే సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా తెలిపారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రస్తుతం ఉన్న 17.29శాతాన్ని 20.02 శాతానికి పెంచడం జరిగిందని అన్నారు. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని అన్నారు.