తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత.. తెరుచుకోనున్న డీఏవీ స్కూల్ - MicTv.in - Telugu News
mictv telugu

తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత.. తెరుచుకోనున్న డీఏవీ స్కూల్

November 2, 2022

Telangana Govt restores recognition for BSD DAV School, to reopen from Thursday

 

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ఓ చిన్నారిపై కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న దారుణ వార్త రాష్ట్రంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ స్కూల్‌లో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై పాఠశాల ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ అఘాయిత్యానికి పాల్పడిన నేపథ్యంలో ఆ స్కూల్‌ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ డీఈవోను ఆదేశించారు. అందులోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి తెలిపారు.

అయితే విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికిప్పుడు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తే తమ పిల్లలను ఎక్కడికి పంపించాలని వారు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఇవాళ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్కూల్‌ గుర్తింపు ఈ విద్యాసంవత్సరం వరకు పునరుద్ధరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యాశాఖ నుంచి అనుమతి లభించడంతో గురువారం నుంచి డీఏవీ పాఠశాల తెరుచుకోనుంది.