ఇంటింటికీ కరోనా సర్వే.. తెలంగాణ సర్కార్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటింటికీ కరోనా సర్వే.. తెలంగాణ సర్కార్ నిర్ణయం

March 24, 2020

Survey

కరోనాను కట్టడి చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యాధి సోకిన వారిని గుర్తించేందుకు పటిష్ట చర్యలను చేపట్టింది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. దీని కోసం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమాచార సేకరణ చేయనున్నారు. వీరంతా ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. ఎవరైనా దగ్గు,జ్వరం, జలుబుతో బాధపడితే వారి వివరాలు నమోదు చేసి తరుచూ సమీక్షించనున్నారు. 

 రాష్ట్రంలోని 27 వేల మంది ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎన్ఎం‌లతో సర్వే చేయనున్నారు. దీని వల్ల బాధితుల వివరాలు, వైరస్ వ్యాప్తి ఎలా ఉందనే విషయాన్ని అంచనా వేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటికే ప్రభుత్వం వైరస్‌ను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకుండా లాక్ డౌన్ చేసి పటిష్ట చర్యలు చేపట్టారు. మరోవైపు నేటి నుంచి గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. ఉన్నతాధికారులతోనూ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉన్నారు.