రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ సర్కార్ సరికొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ‘ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ నెల 8న ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీఆర్, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, ఎస్పీలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ సూచనల మేరకు వైద్యారోగ్యశాఖ సమగ్ర ప్ర ణాళిక సిద్ధం చేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు. మొదటి దశలో 100 పీహెచ్సీ, యూపీహెచ్సీ, బస్తీ దవాఖానాల్లో ప్రారంభించి.. దశల వారీగా మొత్తం 1,200 ఆరోగ్య కేంద్రాలకు విస్తరించనున్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలతో పాటు ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, ఔషధాలు అందిస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, మెనోపాజ్ దశ పరీక్షలు , నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారు.