తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయిఒకేసారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేయడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను కొనసాగిస్తూ, ఆయనకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
టీఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావుకు పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ ఏడీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని నల్లగొండ ఎస్పీగా కొనసాగిస్తూనే యాదాద్రి డీఐజీగా ప్రభుత్వం నియమించింది. ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన స్వాతి లక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ట్రాన్సఫర్ చేసింది. ఆమె స్థానంలో షికా గోయల్‌ను నియమించింది. విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, అక్టోపస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. బీ శివధర్‌రెడ్డిని రైల్వే, రోడ్డు సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్‌గా, కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆర్గనైజేషన్ అండ్ లీగల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది.