తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి నిర్వహించిన ‘గ్రూప్-1’ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశముంది. సంక్రాంత్రికి ముందే ఫలితాలను వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం.. ఒకవేళ కుదరకపోతే రేపు సాయంత్రంలోగా విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. TSPSC Group 1 ప్రక్రియపై ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఎప్పుడో వెలువడాల్సిన ఫలితాలు వాయిదా పడ్డాయి. గత కొన్ని రోజులుగా న్యాయపరమైన అడ్డంకులు రావడంతో ఫలితాల విడుదల సాధ్యం కాలేదు. అయితే.. ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు.
తెలంగాణలో 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్ 16న నిర్వహించింది. నవంబర్ 15న ఫైనల్ కీ ని కూడా విడుదల చేసింది. అయితే రిజర్వేషన్ల విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన కారణంగా కొన్నాళ్లు గందరగోళం ఏర్పడింది. అనంతరం ఓ అభ్యర్థి స్థానికత అంశంపై కోర్టుకు వెళ్లడంతో మరికొన్ని రోజులు ఫలితాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే.. హైకోర్టు తాజాగా ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఒక్క అభ్యర్థి విషయంలో దాదాపు లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్స్ ను ఆపడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమైంది.