తెలంగాణ: త్వరలోనే గ్రూప్-4 ప్రకటన..సిద్దంగా ఉండండి: హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: త్వరలోనే గ్రూప్-4 ప్రకటన..సిద్దంగా ఉండండి: హరీశ్ రావు

July 7, 2022

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుందని, నిరుద్యోగులు సిద్దంగా ఉండాలని ఆర్ధిక, వైద్యాశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అతి తర్వలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను కూడా తయారు చేసి, ప్రకటిస్తామని పేర్కొన్నారు.

సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ‘కేసీఆర్ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్’లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులతో బుధవారం ముఖాముఖిగా మాట్లాడారు.”కేసీఆర్ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి, 95% ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చేశారు. అన్ని జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతోనే 317 జీవో తీసుకొచ్చాం. కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీస అవగాహన, సోయి లేకుండా జీవో 317ను రద్దు చేయాలని రాద్ధాంతం చేశారు. ఉద్యోగార్డులకు నష్టం కలగవద్దనేది మా ప్రభుత్వ ఉద్దేశం. కేంద్రంలో సుమారు 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికే షన్లు ఇచ్చి 1,37,000 పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు 90 వేల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపట్టింది” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణవ్యాప్తంగా నిరుద్యోగులు గ్రూప్-4 నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు కోచింగ్ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు ఈ గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి తాజా అప్డేట్‌ను తెలియజేశారు.