సర్కార్ బడితె పూజకు ప్రైవేట్ ఢమాల్..! - MicTv.in - Telugu News
mictv telugu

సర్కార్ బడితె పూజకు ప్రైవేట్ ఢమాల్..!

June 19, 2017

పట్టపగాల్లేని ప్రైవేట్ బడులకు కళ్లెం పడబోతుందా..?ఫీజులపై తప్ప చదువులపై సోయి లేని స్కూళ్లకు షాక్ తప్పదా..?గురుకులాలు కుళ్ల బొడుస్తున్నాయా…మెరిట్ విద్యార్థుల్ని ఎగురేసుకుపోతున్నాయా… అంటే నో డౌట్. అక్షరాల నిజం.పలకపై గుద్ది చెప్పొచ్చు.ఒకే ఒక్కడి నిర్ణయం…అదీ ఒక్క నిర్ణయం ప్రైవేట్ పాఠశాల్ని పరేషాన్ చేస్తుంది. ఇంతకీ ఏమటా నిర్ణయం..ఏమా కథ..?

ఒకే ఒక్క నిర్ణయం…ఒక్కడి నిర్ణయం..ప్రైవేట్ బడుల్ని పడగొడితే…సామాన్యుల కళ్లల్లో వెలుగులు నింపుతోంది. పిల్లల చదవులపై ఆశల్ని చిగురించేలా చేస్తుంది. హమ్మయ్య…ఇక ఒక టెన్షన్ పోయిందన్న ఖుషీ కనిపిస్తుంది గురుకులాల రాకతో.నియోజకవర్గానికి ఇప్పుడు రెండే గురుకులాలు వచ్చినా ప్రైవేట్ బడులు మాత్రం సగం ఖాళీ అయ్యాయి. సీఎం కేసీఆర్ చెప్పినట్టే ..అదే టైమ్ కి అన్ని రెసిడెన్సియల్ ఏర్పాటు చేస్తే.. ప్రైవేట్ బడులకు దబిడి దిబిడే.మళ్లీ ఎయిటీస్ , నైంటీస్ రోజులు రావొచ్చేమో…అప్పటికి ఇప్పటికి తేడా ఒక్కటే అప్పుడు తెలుగులో..ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో.
1970 నుంచి దాదాపు 2 వేల సంవత్సరం దాకా ప్రభుత్వ పాఠశాలలదే రాజ్యం.వందలో ఎనభై శాతం మంది ఇక్కడే చదివేవారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవాళ్లు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కు పంపేవారు..అవీ తెలుగుమీడియంలోనే నడిచేవి. హయ్యర్ ఫ్యామిలీస్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసేవాళ్లు..ఇది నియోజకవర్గంలో పదిశాతానికి మించకపోయేది. రాను రాను ఈ పరిస్థితి మారిపోయింది. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్లకే ఫ్యూచర్ బాగుందన్న ప్రచారం ప్రైవేట్ బడులవైపు మళ్లీంచేలా చేసింది. ఎలాగూ గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం లేదు. అందుకే అందరూ ప్రైవేట్ బడి బాట పట్టారు. తాము తిన్నా , తినకపోయినా పిల్లలకు మంచి చదవులు చెప్పించాలన్నది సామాన్యుల్లో పెరుగుతూ వచ్చింది. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమకు చేతనైనా కాకపోయినా ఇంగ్లిష్‌ మీడియం కోసం పిల్లల్ని ప్రైవేటు బడుల్లో చేర్పించి చదివిస్తూ వస్తున్నారు.

కానీ సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. భవిష్యత్ లో ఇంకా మారిపోవచ్చు.ఎందుకంటే ఇప్పుడు నియోజక వర్గానికి ఒక బీసీ, ఒక మైనారిటీ గురుకులాలు రావడంతో తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయం దొరికినది. ఈ ఏడాది ఎక్కువగా వీటిలోనే చేర్పించారు. ఎంతలా అంటే ప్రైవేట్ స్కూళ్లలో సగానికి సగం మంది విద్యార్థులు తగ్గిపోయేలా. కష్టపడి పాఠాలు చెబుతున్నా చాలా పాఠశాలల్లో ఒక్కసారిగా విద్యార్థుల సంఖ్య అరవై శాతం మేరపడిపోయింది. ఈ మార్పుతో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు బడులు గురుకులాల ధాటికి పడిపోయాయి. వెళ్లే వాళ్లంతా మెరిట్‌ విద్యార్థులే. ఇప్పటికే ఉన్న గురుకులాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 240 గురుకులాలు ఏర్పాటు చేసింది. వీటిలో ప్రవేశాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పోటీ పడ్డా 80 శాతం సీట్లు ప్రైవేటు విద్యార్థులే దక్కించుకున్నారు. ప్రతిభ ఆధారంగా 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించారు. ఎనభై వేలకు మించిన సంఖ్యలో విద్యార్థులకు గురుకులాల్లో అవకాశం దొరికింది.

గురుకులాల్లో అంతర్జాతీయ స్థాయి చదువులు అందిస్తామని, చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షలు ఖర్చు పెడతామని ప్రభుత్వం చెప్పడమే తల్లిదండ్రుల్ని గురుకులాల వైపు మళ్లేలా చేసింది. మైనారిటీ గురుకులాల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. కొన్ని జిల్లాల్లో పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలంటూ గ్రామాల్లో తీర్మానాలు చేశారు. అయితే గురుకులాల్లో పూర్తి స్థాయి వసతుల్లేని చోట ప్రైవేటు బడులకు పెద్దగా సమస్య లేదు. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటైతే ప్రైవేటు పాఠశాలల మూత తప్పదోమో.
ఇప్పడే ఇలా ఉంటే మొత్తం గురుకులాల స్కూల్స్ ఓపెన్ అయితే ప్రైవేట్ బడుల్ని ఊహించలేం.అయినా మాటిచ్చినట్టు సర్కార్ వీటిని ఏర్పాటు చేసి..ప్రచారం బాగా చేస్తే ..ఎవరికి ప్రైవేట్ బాట పట్టే ఖర్మ ఉండదు. జై సర్కార్ బడులు అంటారు. ఢిల్లీ తరహాలో సర్కారీ స్కూళ్లూ నూటికి నూరుశాతం ఫలితాలు తెప్పిస్తే వీటికి తిరుగుండదు.ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకే దెబ్బకు ప్రైవేట్ ఫీజులకు ముకుతాడు వేయొచ్చు.జై సర్కార్ …జై జై గురుకులాలు…