శివరాత్రి రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు పగటిపూట ఒకలా, రాత్రివేళలు మరోలా ఉన్నాయి. మధ్యాహ్న వేళల్లో ఎండలు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని తెలిపిన విద్యాశాఖ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి సెకండ్ వీక్ నుంచి స్కూల్స్ సగం పూటే నడుస్తాయని తెలిపింది. అంటే విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం ప్రకారం మార్చి 15 బుధవారం నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం అవ్వనున్నాయి.
ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. ఇక తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి. ఇక 6 నుంచి 9 క్లాసెస్ వారికి ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 21న వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24న పెరెంట్స్ మీటింగ్ పెట్టి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని, ప్రిన్సిపల్స్‌కు పాఠశాల విద్యాశాఖ సూచించింది.