Telangana: Heavy rains for two more days..in 11 more districts
mictv telugu

తెలంగాణ: మరో రెండు రోజులు భారీ వర్షాలు..మరో 11 జిల్లాల్లో

July 9, 2022

Telangana: Heavy rains for two more days..in 11 more districts

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి కాలనీలు నీట మునిగి రహదారులపైకి నీళ్లు చేరాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాగే, మరో రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని, మరో 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది.

”హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కాలనీలు, రోడ్లు వరదలతో నిండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18.03 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, శుక్రవారం సాయంత్రానికల్లా 26.57 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 47 శాతం అధికమని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 20 జిల్లాల్లో అధిక వర్షపాతం, 3 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది” అని వాతావరణ శాఖ తెలిపింది.

మరోపక్క జోరుగా వానలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం మొదలైంది. ఇప్పటికే దుక్కి దున్ని, విత్తనాలు, నారు మడులు సిద్ధం చేసుకున్న రైతులు వానలు కురుస్తుండడంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఉద్యాన పంటల సాగు సైతం ఊపందుకుంది. కూరగాయలకు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వాటి సాగువైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ వాసులు వర్షం పట్ల జాగ్రత్తలు వహించాలని, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నాయని ప్రకటన ద్వారా వాతావరణ శాఖ తెలిపింది.