తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి, అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక, తెలంగాణ విషయానికొస్తే, ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు నేడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాదు, బుధవారం రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం మాత్రం అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోపక్క మంగళవారం పలు ప్రాంతాల్లో 10 సెం.మీ పైగా వర్షపాతం నమోదైందని, గరిష్టంగా పెద్దపల్లి జిల్లా కనుకులలో 16 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లో జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట పుష్కర్ ఘాట్ వద్ద పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల జలదిగ్భంధంలో చిక్కుకుంది. వర్షాలు, వరదలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.