తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్లో ఉన్న వాతావరణ శాఖ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు.
”రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని అధికారులు తెలిపారు.