విరసం నేత ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై హైకోర్టు ఆగ్రహం   - MicTv.in - Telugu News
mictv telugu

విరసం నేత ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై హైకోర్టు ఆగ్రహం  

January 18, 2020

professor kasim.

విప్లవ రచయితల సంఘం కొత్త కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు అధ్యాపకుడు ప్రొఫెసర్ చింతకింది కాశీం అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అరెస్ట్ అక్రమమని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ వేసిన పిటిషన్ ను కోర్టు ఈ రోజు సాయంత్రం విచారించింది. నాలుగేళ్ల కిందట మావోయిస్టుల లింకు కేసులో కాశీం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రభుత్వ న్యాయవాది ఆరోపించింది. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

‘ఆయన అండర్ గ్రౌండ్ లో లేరు కదా. ప్రతి రోజూ కాలేజికి వెళ్లి పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌ ఎలా తప్పించుకుంటారు?’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  జీకే మహేశ్వరి మండిపడ్డారు. కాశీంను గజ్వేల్ కోర్టులో హాజరుపరుస్తామని ప్రభుత్వం చెప్పగా సీజే అక్కర్లేదన్నారు. ఆయనను ఆదివారం ఉదయం 10 గంటలకు తన నివాసంలో హాజరుపరచాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేశారు.