Telangana High Court bans DJ sounds in pubs at night
mictv telugu

పబ్‌లకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. రాత్రిపూట అవి నిషేధం

September 12, 2022

హైద్రాబాద్ మహా నగరంలోని పబ్బులపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి పది గంటల తర్వాత నుంచి ఎలాంటి డీజేలు ఉండకూడదని ఆదేశించింది. ఉదయం ఆరు గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. జనావాసాల మధ్య పబ్‌లకు అనుమతి, పబ్‌లలో మద్యం సరఫరా, పెద్ద శబ్దాలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఇళ్లు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాలలో పబ్‌లకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది. ఇప్పటిదాకా నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు, వాటిపై నమోదు చేసిన కేసుల వివరాలను ఆరా తీసింది. ఈ అంశంపై సమగ్ర వివరాలు అందించాలని నగర పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాత్రి వేళల్లో మాత్రమే పబ్‌లలో మద్యం సరఫరా చేయాలని, ఎలాంటి సౌండ్ కానీ, నృత్యాలు కానీ అనుమతించరాదని ఉత్తర్వులలో పేర్కొంది. అలాగే ఇప్పటిదాకా ఎన్ని పబ్‌లకు అనుమతి ఇచ్చారో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర అబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.