చీపురుకట్టతో హత్యా? ఆశ్చర్యపోయిన హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

చీపురుకట్టతో హత్యా? ఆశ్చర్యపోయిన హైకోర్టు

May 8, 2019

తెలంగాణ హైకోర్టులో ఓ వింత కేసు విచారణకు వచ్చింది. ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు చీపురు కట్టతో కొట్టి చంపారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. చీపురుతో కొడితే మనిషి చనిపోవడం ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం పోలీసులకు మొట్టికాయలు వేసి.. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..కరీంనగర్ జిల్లాకు చెందిన తూర్పాటి కామాక్షి అనే మహిళను వెంకటమ్మ, ఆమె తనయుడు రాజశేఖర్ కలసి చీపురు కట్టను తిరగేసి కొట్టారని, ఈ దాడిలో గాయపడిన కామాక్షి చనిపోయిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana high court grant conditional bail to two suspects two arrested in strange murder with broom case

ఈ కేసులో విచారణ జరిపిన కింది కోర్టు నిందితులు ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో ఇద్దరు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టులో పోలీసుల తరపు ప్రాసిక్యూటర్ చీపురుకట్ట తిరగేసి కొట్టడం వల్లే కామాక్షి చనిపోయిందని వాదించాడు. కాగా, నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైద్యుల నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడం వల్ల చనిపోయినట్టు ఉందన్నారు. దీంతో చీపురు కట్టతో కొడితే పక్కటెముకలు విరిగిపోతాయా? అదేమైనా మారుణాయుధమా? అని పోలీసుల తరపు ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో పోలీసుల తరఫు ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించని కోర్టు ఇద్దరు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.