హుసేన్ సాగర్‌లో నిమజ్జనంపై ఆంక్షలు.. ట్యాంక్ బండ్‌లో నో ఎంట్రీ.. - MicTv.in - Telugu News
mictv telugu

హుసేన్ సాగర్‌లో నిమజ్జనంపై ఆంక్షలు.. ట్యాంక్ బండ్‌లో నో ఎంట్రీ..

September 9, 2021

 Telangana High Court imposed Restrictions on immersion of ganesh idols in Hussain Sagar tank bund

హుసేన్ సాగర్‌లో వైభవంగా సాగే గణేశ్ నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు కఠిన ఆంక్షలు విధించింది. నీటి కాలుష్యాన్ని అరికట్టేలా నిమజ్జం ఉండాలని, దీని కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను చెరువులో కలపకుండా చూడాలని అడ్వొకేట్ మామిడి వేణు మాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ రోజు విచారించి తీర్పు చెప్పింది.

‘మట్టిబొమ్మలను నిమజ్జనం చేసుకోవచ్చు. ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాలను చెరువులో వేయొద్దు. . ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రబ్బర్ డ్యాములతో ప్రత్యేక కుంటలు ఏర్పాటుచేయాలి. హుస్సేన్ సాగర్లో అన్ని చోట్లా కాకుండా పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డు, సంజీవవయ్య పార్కుల వైపు నుంచి నిమజ్జనం చేసుకోవాలి. ఇళ్లలోని విగ్రహాలను ఇంట్లోని బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలి. వినాయక మంటపాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమికూడకూండా చర్యలు తీసుకోవాలి. నిమజ్జనం వేడుకల్లో కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలి. ప్రజలకు ఉచితంగా మాస్కులు ఇవ్వాలి. భౌతిక దూరం పాటించేలా చూడాలి. నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాలను తొలగించాలి. నిమజ్జనానికి వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాని, జీహెచ్ఎంసీని కోర్టు ఆదేశించింది.

రాకపోకలకు ఆటంకం కలిగించేలా రోడ్ల మధ్య మధ్య విగ్రహాలు నిలపకుండా చూడాలని, రాత్రి 10 గంటల తర్వాత మైకులను బంద్ చేయాలని స్పష్టం చేసింది. శుక్రవారం నుంచి మొదలయ్యే చవితి వేడుకలు ఈ నెల 19న నిమజ్జనంతో ముగియనున్నాయి. హైదరాబాద్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఈసారి 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడ‌ల్పు 28 ట‌న్నుల బ‌రువుతో ఏర్పాటు చేస్తున్నారు.