ఆ జీవో లేదు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం కాదు.. హైకోర్టు  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ జీవో లేదు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం కాదు.. హైకోర్టు 

November 11, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కేసులో ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదిక సమర్పించింది. విచారణ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధ సమ్మెగా భావించలేమని అభిప్రాయపడింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఉస్మానియూ యూనివర్సిటీ విద్యార్థి వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపైకోర్టు స్పందిస్తూ.. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటే.. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్యను ఆదేశించింది. దీనికి ఆయన స్పందిస్తూ ఆర్టీసీని ప్రజాప్రయోజన సేవ(పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌) కనుక ఎస్మా పరిధిలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే  ప్రజాప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తేనే అది అత్యవసర సర్వీసు అని స్పష్టం చేసింది. 

Telangana high court on rtc strike.

కాగా, కోర్టు ఆదేశాల మేరకు తాము రూ.47 కోట్లు చెల్లించినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వం కోర్టు తెలిపింది. ‘తప్పనిసరి చెల్లింపులు, అప్పులు, నష్టాలు రూ.2,209 కోట్లు దాకా ఉన్నాయి. రూ.47 కోట్లు ఏ మూలకూ సరిపోవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు మొండిగా ఉంటే  చర్చలు అసాధ్యం..’ అని పేర్కొంది. చర్చలు జరపాలని తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని, తమకూ కొన్ని పరిమితులు ఉంటాయంటూ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.