సమ్మెపై ముగిసిన విచారణ.. రంగంలోకి కార్మిక శాఖ కమిషనర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

సమ్మెపై ముగిసిన విచారణ.. రంగంలోకి కార్మిక శాఖ కమిషనర్‌

November 18, 2019

నెలన్నరగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా సాగిన విచారణను హైకోర్టు ఈ రోజు ముగించింది. బంతిని రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ వైపు నెట్టింది. సమ్మె చట్టబద్ధమో, చట్టవిరుద్ధమో తేల్చి, సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ను ఆదేశించింది. 

‘ఇది కార్మికులకు, ఆర్టీసీకి సంబంధించిన సమస్య. మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దీనిపై మేం ఎవరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేం. మా పరిధి దాటి ముందుకు వెళ్లలేం. అయితే సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు చెబుతున్నాం. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవే.. సంస్థను కాపాడుకోవాలని వారు సమ్మె చేస్తున్నారు…’ అని పేర్కొంది.

కాగా, ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని, నిర్ణయం తీసుకోవాల్సింది కార్మిక కోర్టు అని హైకోర్టు చేతులెత్తేసింది. ‘మా ముందు రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. చట్ట విరుద్ధమని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటుంది.. చర్చలకు ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో  చెప్పాలి..’ అని కోరింది. సమస్య పరిష్కారం కోసం సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేస్తామని ఇదివరకు హైకోర్టు చెప్పగా, ప్రభుత్వం అంగీకరించని సంగతి తెలిసిందే. మరోపక్క.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలన్న తమ కీలక డిమాండును తాత్కాలికంగా పక్కనబెడుతున్నామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. అయినా ప్రభుత్వం చర్చలకు, ఇతర డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావడం లేదు.