Telangana High Court order to immediately release Rohingyas in Charlapalli Jail
mictv telugu

HYD రోహింగ్యాలపై హైకోర్టు తీర్పు.. ప్రభుత్వ జీవో కొట్టివేత

September 15, 2022

మయన్మార్ నుంచి వలస వచ్చి నగరంలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల విషయంలో పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన రోహింగ్యాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాక, ఈ అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సైతం కొట్టివేసింది. రోహింగ్యాల తరపున షకీల్ హెబియస్ కార్పస్ ఫైల్ చేయగా, ఈ పిటిషన్‌ని ధర్మాసనం విచారించింది. వివరాల్లోకెళితే.. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ – 3 92)e జీవోను జారీ చేసింది.

దీని ప్రకారం నగరంలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. దీంతో ఈ జీవో ఆధారంగా రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది షకీల్ మాట్లాడుతూ.. ఫారినర్స్ యాక్ట్‌పై జీవో ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని వాదించారు. రోహింగ్యాలను క్యాంపులో పెట్టకుండా జైలులో పెట్టారని, డిటెన్షన్ క్యాంపుల జాబితాలో చర్లపల్లి జైలు లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టినా వారి కదలికలపై నిఘా పెట్టవచ్చని విన్నవించారు. దీంతో పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. వెంటనే అరెస్ట్ చేసిన రోహింగ్యాలను విడుదల చేయాలని ఆదేశించింది. దాంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది.