తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ పంచాయతీ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. పిటిషన్ విచారించిన కోర్టు.. వేడుకలను అధికారికంగా జరిపి తీరాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్పష్టంగా ఆదేశించింది. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ మాధవి ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించింది. గణతంత్ర దినోత్సవాలను అధికారికంగా జరపాలన్న కేంద్రం ఆదేశాలను రాష్ట్రం పట్టించుకోలేదని శ్రీనివాస్ అనే పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఐదు లక్షల మందితో జరిపిన పార్టీ సభకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు రిపబ్లిక్ డేకు అడ్డొస్తాయా అని ప్రశ్నించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించడం లేదని ప్రభుత్వం వాదించింది. ఈ ఏడాది రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్నామని చెప్పింది.అన్ని అంశాలు పరిశీలించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలని, వేడుకలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది.