కేసీఆర్‌కు ఎదురుదెబ్బ.. 402 జీవో కొట్టివేసిన ధర్మాసనం - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు ఎదురుదెబ్బ.. 402 జీవో కొట్టివేసిన ధర్మాసనం

April 12, 2022

 

kcr

టీచర్ల బదిలీల వివాదంలో తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. టీచర్ల పరస్పర అంగీకార బదిలీలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన 402 జీవోను సోమవారం తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై వివరణనివ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఏంటీ 402 జీవో?

కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమంలో భాగంగా ఎవరైనా ఉద్యోగులు తమకు కేటాయించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా తమకు అనుకూలమైన చోట లేదా భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా బదిలీలు చేసుకోవడానికి వీలుగా పరస్పర అంగీకారంతో బదిలీలు చేసుకోవచ్చు. అయితే బదిలీపై వచ్చిన టీచర్లు కొత్త జిల్లాలో ఇంతకు ముందు తమకున్న సీనియారిటీని కోల్పోతారు. మళ్లీ మొదటి నుంచి సర్వీసును ప్రారంభించాల్సి ఉంటుంది. దీన్ని నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 402 జీవో తెచ్చింది. దీని ప్రకారం కొత్త జిల్లాకు బదిలీపై వెళ్లినా పాత సీనియారిటీ ప్రకారమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అభ్యంతరం ఎందుకు?

అయితే దీని వల్ల తాము నష్టపోతామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్టీజీ టీచర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పరస్సర బదిలీలు చేసుకునేవారు కొత్త జిల్లాలో తమ సీనియారిటీ కోల్పోయి జిల్లా క్యాడర్‌లో చివరి ర్యాంకు నుంచి తమ సర్వీసును ప్రారంభిస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.