వర్మ ‘మర్డర్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్  - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ ‘మర్డర్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

November 6, 2020

మిర్యాలగూడ యువకుడు ప్రణయ్ కులహత్యపై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘మర్డర్’ చిత్రానికి అడ్డంకి తొలగిపోయింది. కొన్ని షరతులతో చిత్రాన్ని విడుదల చేసుకోడానికి తెలంగాణ హైకోర్టు ఈ రోజు అనుమతించింది. సినిమాల  అమృత, ఆమె తండ్రి మారుతిరావు, భర్త  ప్రణయ్‌ల ఫొటోలు వాడకుండా విడుదల చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. 

మర్డర్ సినిమా ‘మారుతి రాసిన అమృతప్రణయ గాథ’ అని ప్రచారం చేసుకున్న దర్శకుడు తర్వాత వెనక్కి తగ్గి కుటుంబ కథాచిత్రమ్ అని చెప్పుకున్నారు. ఈ సినిమాను విడుదల చేయకూడదని అమృత, ఆమె అత్తింటి వారు కోర్టుకెక్కారు. కేసుపై ఇంకా విచారణ జరుగుతోంది కనుక సినిమా వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నల్గొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. అయితే సమాజంలో జరగుతున్న కులహత్యలపై తాము సినిమా తీశామని, ఇది కల్పిత కథ అని వర్మ వివరణ ఇచ్చాడు. దీంతో హైకోర్టు షరలతులతో అనుమతి మంజూరు చేసింది. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ‘మర్డర్’లో  శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి నటించారు. కోర్టు తీర్పుపై వర్మ హర్షం వ్యక్తం చేశారు. దిశ హత్యాచార ఘటనపై వర్మ తీస్తున్న చిత్రం కూడా వివాదాస్పదం కావడం తెలిసిదే. దీన్ని నిలిపివేయాలని దిశ కుటుంబంతోపాటు నిందితుల కుటుంబాలు కూడా కోర్టును ఆశ్రయించాయి.